నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో జరుగుతున్న సుందరీకరణ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. చెరువులోకి మురికి నీరు కలవకుండా చెరువు చుట్టూ నిర్మిస్తున్న యూజీడీ పైప్ లైన్ల లెవలింగ్స్ను తెలుసుకోవడానికి స్వయంగా తానే పైప్ లోపలికి వెళ్ళి పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ. 31.26తో గంగారాం పెద్ద చెరువు, మియాపూర్ పటేల్ చెరువు సుందరికరణ పనులు చేపట్టడం జరిగుతుందని అన్నారు. చెరువు చుట్టు చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులను లెవలింగ్స్ సరిగ్గా చూసుకొని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుడదని, అదేవిధంగా పటేల్ చెరువులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు వేగవంతం చేయాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని సూచించారు.

చెరువు మధ్యలో హై ల్యాండ్ నిర్మాణం వలన చెరువు అందాలు తిలకించడానికి, ముఖ్యంగా పక్షులు సేద తిరడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, బోటింగ్ ద్వారా హై ల్యాండ్ కి చేరుకోవచ్చని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువులను సంరక్షించడంపై దృష్టి సారించామన్నారు. కలుషితం కాకుండా, కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని, చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఏఈఈ శేషగిరిరావు, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






