నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మంగళవారం ఫీవర్ సర్వే మొదలైంది. జిహెచ్ఎంసి సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో సర్కిల్ ఉప కమిషనర్ సుధాంష్ నందగిరి పాల్గొని స్వయంగా వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా సుధాంష్ మాట్లాడుతూ ఈ సర్వే వల్ల ప్రజల తాజా ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని, అదే విధంగా వారికి సరైన సహకారం అందించేందుకు వీలవుతుందని అన్నారు. వారి లక్షణాలకు అనుగుణంగా సేవల కోసం తగిన మార్గదర్శకం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉప వైద్యాధికారి డాక్టర్ బి కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.





