నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్ప ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయ చతుర్ధ బ్రహ్మోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు వేదుల పవనకుమార్ శర్మ పర్యవేక్షణలో ఆర్చక బృందం మొదటి రోజు ప్రత్యక పూజలు ఆచరించారు. శ్రీలక్ష్మీ గణపతి మూలవీరాట్కు చెరుకురసం, పాలతో 444 మంత్రోచ్ఛారణల నడుమ విశేష పంచామృతాభిషేకం ఆచరించారు.
అదేవిధంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, ధీక్షాధారణ, శ్రీ గణపతి హోమం, సాయంత్రం ధ్వజారోహనం, అంకురారోపణ, యాగశాల ప్రవేశం, వాస్తుపూజ, సర్వతో భద్రమండల దేవతారాధన, నవగ్రహ యోగిని, క్షేత్రపాలక ఆరాధన, అగ్ని ప్రతిష్ట, ప్రధాన హోమములు నిర్వహించారు. విశేషాలంకరణలో శ్రీలక్ష్మీ గణపతి స్వామి భక్తులకు కనువిందు చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, పాలకమండలి సభ్యులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.