నమస్తే శేరిలింగంపల్లి: కరోనా రెండవ దశతో భారతదేశంలో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఉపద్రవం నుండి బయట పడేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. సగటున రోజుకు దాదాపు 3 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటం చూస్తుంటే వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకరమైనది. కోవిడ్ సోకిన వ్యక్తులు అతిగా ఆందోళన చెంది లేని భయాలను సృష్టించుకుంటున్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఎవరు ఆసుపత్రికి వెళ్లాలి, ఎవరు వెళ్లకూడదో ముందుగా తెలుసుకోవాలి.
ఏ వ్యక్తికైనా శరీర ఊష్ణోగ్రతలు అధికంగా ఉండి 4-5 రోజుల పాటు కొనసాగుతూ, శరీర ఆక్సిజన్ స్థాయి 90 కన్నా తక్కువగా ఉండటంతో పాటు ఛాతిలో అసౌకర్యంగా అనిపించినా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆసుపత్రిలో చేరాలి. కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తీవ్రంగా ఉన్నవారు, వయసుతో పాటు వచ్చే వ్యాధులను దీర్ఘకాలికంగా కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సహాయాన్ని పొందాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్క కోవిడ్ రోగి ఛాతి యొక్క సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగా సెరాలజీ కి సంబంధించిన డి.డైమర్స్, సీరమ్ ఫెర్రిటిన్, సిబిపి, లాక్టేట్ హైడ్రోజినేజ్, సి రియాక్టివ్ ప్రొటీన్ తదితర పరీక్షల ఫలితాలు అసాధారణంగా ఉన్నప్పుడు మాత్రమే ఛాతి సిటీ స్కాన్ చేయించుకోవాలి. చాలా డయాగ్నాస్టిక్ సెంటర్లు కోవిడ్ ప్రొపైల్ పేరిట పరీక్షలు నిర్వహిస్తుండగా వారు ఇచ్చే ప్యాకేజీలో పై పరీక్షలు ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది.
అవసరం ఉన్నా లేకపోయినా ఆక్సీజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసి పరుగులు తీయడం వల్ల మార్కెట్‌లో వాటి కొరత ఏర్పడి అత్యవసర స్థితిలో ఉన్న వారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.వాటికి బదులుగా నెబ్యులైజర్లు, ఆక్సీజన్ కాన్‌సన్‌ట్రేటర్లను వినియోగించుకోవచ్చు. అనవసర భయాలకు లోనై అవసరం లేకున్నా ఆసుపత్రులలో చేరడం మంచిది కాదు. ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్ల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ప్రతీ ఒక్కరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది. మనదేశంలోనే తయారైన రెండు వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉండటం మన అదృష్టం.
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రెండు వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సంశయం లేకుండా ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా వేయించుకోవాలి. ప్రస్తుతం మనమంతా ఎంతటి ప్రమాదకర పరిస్థితులలో ఉన్నామో ప్రతీ ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రతీ పౌరుడు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు భాద్యతాయుతంగా వ్యవహరించాలి. ఎక్కువ మంది ఒకే చోట కూడే విందులు, సమావేశాలకు దూరంగా ఉండండి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండం. తరచుగా చేతులను శానిటైజర్ గానీ సబ్బుతో గానీ శుభ్రపరచుకోవాలి. రోగనిరోదక శక్తిని పెంపొందించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు తీసుకోవాలి. విటమిన్ సి, డి లభించే ఫుడ్ సప్లిమెంట్లను వాడాలి. ప్రతీరోజూ వ్యాయామం చేయడంతో పాటు ఆక్సిజన్ స్థాయిని పెంచుకునేందుకు ప్రాణాయామం చేయాలి. మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇతరులెవ్వరూ బాధ్యత వహించరు. మీ జీవితం మీ కుటుంబానికి ఎంతో విలువైనది. త్వరలోనే ఈ కరోనా మహమ్మారిపై భారత్ విజయం సాధించాలని ఆశిద్దాం.
డాక్టర్ పి. కల్పన (B.H.M.S)
Panel doctor for NFC