నమస్తే శేరిలింగంపల్లి: నగరంలోని నెక్లెస్ రోడ్డు జలవిహార్ లో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రతినిధుల మహాసభకు శేరిలింగంపల్లి జర్నలిస్టులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా జలవిహార్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పైళ్ల విట్టల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి లు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన టీయూడబ్ల్యూజే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జర్నలిస్టుల జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. తాజాగా జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 17.5 కోట్ల నిధులను విడుదల చేయించిన ఘనత టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే యూనియన్ కు దక్కుతుందన్నారు. మహాసభకు తరలివెళ్లిన వారిలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, టెంజు అధ్యక్షుడు పి. సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ లతో పాటు ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.






