చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ శంకరాలయ 21 వ వార్షిక శివోత్సవములు ఐదవ రోజు ఘనంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి అచార్యులు, శైవ ఆగమ వేద పండితులు సుబ్రహ్మణ్యం శర్మ బృందం పర్యవేక్షణలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా త్రీశూల అభిషేకం, శ్రీ భవానీ శంకరులకు అభిషేకం, నిత్యహోమాలు, పూర్ణాహుతి, బలిహరణ, ద్వజాఅవరోహణ, ధీక్ష విరమణలతో పాటు త్రీశూల స్నానం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పురోహితులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించారు. స్థానిక భక్తులు రామకృష్ణ శర్మ, లలితా పరమేశ్వరి దంపతులు అన్నదానం సేవలో భాగస్వాములవ్వగా పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవానీ శంకరులను దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం రథోత్సవంలో భాగంగా చందానగర్ పురవీధుల్లో శ్రీ భవానీ శంకరులు ఊరేగారు. దారిపొడవునా భక్తులు స్వాగతం పలుకుతు స్వామివార్లను దర్శించుకున్నారు.






