హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ల చేతుల మీదుగా నగరంలోని విద్యానగర్ బిసి భవనంలో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రేగొడ్ మండలం ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తెనుగు నర్సింహులు, సంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా తెల్లాపుర్ గ్రామానికి చెందిన పి.గణేష్ యాదవ్, రేగొడ్ మండల అధ్యక్షుడిగా సిందొల్ గ్రామానికి చెందిన ఆవుటి నర్సింహులులను నియమించారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వెనుక బడిన కులాల వారు రాజకీయంగా, ఆర్థికంగా అణచి వేతకు గురవుతున్నారని, యువకులు మేల్కొని చైతన్యం చేయాలని సూచించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. సమాజంలో బీసీలంతా ఐక్యమై తమ హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని సూచించారు. జాతీయ బీసీ సంఘం కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పదవులు తీసుకోవడమే కాకుండా వాటికి వన్నె తెచ్చే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ సందర్భాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపి పాఠశాలలలో వసతుల కల్పనకు కృషి చేసి, విద్యావిధానంలో అమూల్యమైన మార్పులు తెచ్చేందుకు నూతనంగా పదవులు తీసుకున్న వారు కృషి చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో కాలంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం అని అన్నారు. బీసీలను తొక్కుతూ పాలకులు తమ పదవులు కాపాడు కోవడం కోసం బీసీలను బానిసలుగా వాడుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా చదువుకున్న యువకులంతా ముందుకు వచ్చి గ్రామ స్థాయి, క్షేత్ర స్థాయి, జిల్లాస్థాయిలలో ప్రజల సమస్యలు తెలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వాటికి పరిష్కారం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మారి రాజశేఖర్, వెంకటేష్, ఏ. వెంకటేష్, విజయ్, ఆనంద్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.





