మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మతి స్థిమితం లేని వ్యక్తి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం కానగుడ్డ గ్రామానికి చెందిన అమ్మకోళ్లు నారాయణ (25) కుటుంబం 10 సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మాదాపూర్లోని చంద్ర నాయక్ తండాలో నివాసం ఉంటోంది. వారు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కాగా నారాయణకు మతి స్థిమితంగా లేదు. ఈ క్రమంలో అతను శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నారాయణ ఎత్తు సుమారుగా 5 అడుగుల 5 అంగుళాలు ఉంటుందని, చామన ఛాయ రంగులో ఉంటాడని, నల్లని లోయర్, బ్లూ కలర్ టి షర్ట్, ఆరెంజ్ కలర్ టవల్ ధరించి ఉంటాడని, తెలుగు, కన్నడ, హిందీ భాషలు మాట్లాడుతాడని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని మాదాపూర్ పోలీసులు తెలిపారు.






