నమస్తే శేరిలింగంపల్లి: అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమ స్వరార్చన, నృత్యార్చన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి మొదట శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, అన్నమ గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం శ్రీ త్రినేత్ర ఆర్ట్స్ అకాడమీ గురువు భారతి దేవి, వారి శిష్య బృందం తన్మయి, రుక్షిత, హోత్ర, విహన, యశ్విత, దాక్షిణ్య, వైష్ణవి, కుందనప్రియ, నిత్య సంతోషిని సంయుక్తంగా తమ తమ నృత్య ప్రదర్శనలతో నయనానందకరంగా సాగింది. ఇందులో భాగంగా, “పుష్పాంజలి, కొండలలో నెలకొన్న, బ్రహ్మమొక్కటే, నిరుపమ సుందరాకర, శరణు ముద్దుగారే యశోద, చక్కని తల్లికి, అష్టలక్ష్మీ స్తోత్రం, అదివో అల్లదిహో, సిరుత నవ్వులవాడే సిన్నెక్కా, పలుకే బంగారమాయెనే” అనే సంకీర్తనలను ప్రదర్శించారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు శాలువా జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చారు.