నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీలలో వరద ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ గంగాధరరెడ్డి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. వరదనీటి కాలువల అభివృద్ధిపై జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి గురువారం డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలాల ద్వారా ప్రవహించే నీరు ఎక్కడా నిలవకుండా అభివృద్ధి చర్యలు చేపట్టాలని జి.హెచ్.ఎం.సి అధికారులకు సూచించారు. వరదనీరు సులువుగా ప్రవహించే విధంగా నాలాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెలకొన్న వరద సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపి, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్, బిజెపి నాయకులు మన్నే రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.