నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసిన సూపర్ స్ప్రెడర్‌లకు మాత్రమే బుధవారం నుండి కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నట్లు చందానగర్ సర్కిల్ శానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా సూపర్ స్ప్రెడర్‌ల వ్యాక్సినేషన్ నమోదు ప్ర్రక్రియను శేరిలింగంపల్లి సర్కిల్ నిర్వహించిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలనివ్వడంతో గ్రేటర్ వ్యాప్తంగా ఇదే పద్దతిని అవలంబించనున్నారు. జిహెచ్ఎంసి కమీషనర్ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలో 20 మంది ఎస్ఎఫ్ఎలతో సూపర్ స్ర్పెడర్‌లుగా గుర్తింపు పొందిన తొమ్మిది విభాగాల వారిని గుర్తించి మొబైల్ యాప్ ద్వారా వారి వివరాలు నమోదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ జరిగిన అనంతరం వారివారి మొబైల్‌లకు వచ్చిన మెసేజ్‌ల ఆధారంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై టోకెన్ల ఆధారంగా వ్యాక్సినేషన్ జరగదని, తమ సిబ్బంది వివరాలు సేకరించిన వ్యక్తులు మాత్రమే తమ ఆధార్‌కార్డుతో పిజెఆర్ స్టేడియంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది.
