నమస్తే శేరిలింగంపల్లి: ఐక్య యువజన సమాఖ్య నేత అమరవీరుడు కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని ఏఐఎఫ్‌డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ అన్నారు. పొలం గోపాల్ రెడ్డి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం మియాపూర్ స్టాలిన్ నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వనం సుధాకర్ మాట్లాడుతూ ఐక్య యువజన సమాఖ్య (UYF) నిర్మాత యువజన ఉద్యమ స్ఫూర్తి కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి హత్యకు గురై నేటికి 34 సంవత్సరాలు అవుతుందన్నారు. వరంగల్ జిల్లా మొగిలిచర్ల గ్రామంలో పుట్టిన కామ్రేడ్ గోపాల్ రెడ్డి నాడు యువైఎఫ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

నేడు అఖిల భారత స్థాయిలో అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (AIFDY)ఏర్పాటుకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు, నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు, పాలకవర్గాల, పెట్టుబడిదారులు అవలంబిస్తున్న నిరుద్యోగ యువజన, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఒక సమరశీల పోరాటం బలపరచుకోవాలని 1985లో ఐక్య యువజన సమాఖ్యను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పరిచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. 1987 జూన్ 1న కాంగ్రెస్(ఐ), నక్సలైట్లు, భూస్వామ్య గుండాలు కుమ్మకై కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డిని వరంగల్ పట్టణం, కాశిబుగ్గ లోని సిద్దయ్య హోటల్ ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో కాల్చి చంపారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో యువజన ఉద్యమాన్ని మరింత బలపరిచేందుకు ఐక్య యువజన సమాఖ్య(UYF)ను దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తూ 1999 డిసెంబర్ 25న అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(AIFDY)ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కామ్రేడ్ పొలం గోపాల్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో యువజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆయన ఆశయాలపై యువత పోరాడి కుల,మత,ప్రాంతీయ అంతరాలు లేని సమాజ నిర్మాణానికై నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువైఎఫ్ మాజీ రంగారెడ్డి జిల్లా నాయకులు, యుపిఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు మైదం శెట్టి రమేష్ ఎఐఎఫ్‌డివై గ్రేటర్ హైదరాబాద్ నాయకులు డి. రంగస్వామి, బి.రవి. ఎఐఎఫ్‌డివై నాయకురాలు పి.భాగ్యమ్మ, ఎం రాణి, డి.లక్ష్మి ఎఐఎఫ్‌డిఎస్ నాయకులు ఎం.వివేక్, వి. స్టాలిన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.