- యజమానులకు తిరిగి చేరిన కోటిన్నర విలువైన సొత్తు
నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిది లో చేసుకున్న పలు దొంగతనాలు దోపిడీలు తదితర నేరాల్లో అపహరణకు గురైన దాదాపు కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు, డబ్బుతో పాటు వాహనాలు తిరిగి యజమానుల చెంతకు చేరాయి. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ గ్రౌండ్స్ లో వివిధ నేరాల్లో నిందితుల వద్దనుంది పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులతో స్టోలెన్ రిలీస్ ప్రాపర్టీ మేళా నిర్వహించారు.
మేళా లో భాగంగా 93.1 తులాల బంగారం, 360.2 తులాల వెండి ఆభరణాలు, 90 వాహనాలు, 35 మొబైల్ ఫోన్లు, 11 ఇతర వస్తువులు, 30,67,463 రూపాయల నగదు తో కలిపి దాదాపు రూ.1.50 కోట్ల విలువైన సొత్తును వాటి యజమానులకు సైబరాబాద్ కమీషనర్ విసి. సజ్జనార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకున్న అపహరణకు గురైన సొత్తును తిరిగి వారికి అందించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సంవత్సరం వివిధ పోలీసు స్టేషన్లు, డిటెక్టీవ్ విభాగాలు, సీసీఎస్, ఎస్ఓటి విభాగాల ఆధ్వర్యంలో అధిక మొత్తంలో అపహరణకు గురైన సొత్తును రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.
సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రో యాక్టివ్ ఇంటిమేషన్ ఆ డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్ మెకానిజం ద్వారా బాధితులు పోగొట్టుకున్న సొత్తును సులభంగా అందించడమే కాకుండా న్యాయస్థానాల్లో అవరమైన సహకారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కేసులను ఛేదించి నిందితుల నుండి సొత్తును రికవరీ చేయడంలో కృషి చేసిన సిబ్బందికి సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, సీసీఆర్బీ ఏసీపీ రవిచంద్ర, ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, కంట్రోల్ రూమ్ ఇన్స్ పెక్టర్ యాదగిరి తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.