సీటు కింద పాముతో కిలోమీట‌రు ప్ర‌యాణం…విష‌యం తెలిసి రైడ‌ర్‌ షాక్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ద్విచ‌క్ర‌వాహ‌నం సీటు కింద పాము ఉంద‌ని తెలియ‌క ఓ వ్య‌క్తి దాదాపు కిలోమీట‌రు దూరం ప్ర‌యాణించాడు. బైక్‌లో స‌మ‌స్య త‌లెత్త‌డంతో స‌ర్వీసు సెంట‌రుకు వెళ్ల‌గా మెకానిక్ పాము ఉన్న విష‌యం చెప్ప‌డంతో న‌డిపిన వ్య‌క్తి ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాడు. శేరిలింగంప‌ల్లిలో శ‌నివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… శేరిలింగంప‌ల్లి శివాజీన‌గ‌ర్‌లో నివాస‌ముండే ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్‌ గండిచెర్ల జ‌నార్ధ‌న్‌రెడ్డి కుమారుడు దీక్షిత్ రెడ్డి శ‌నివారం త‌న రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ద్విచ‌క్ర‌వాహ‌నంపై లింగంప‌ల్లి గిడ్డంగి స‌మీపంలోని త‌న కార్యాల‌యానికి వెళ్లాడు. ప‌ని ముగించుకుని తిరిగి వ‌చ్చే క్ర‌మంలో బైక్‌ స్టార్ట్ కాకపోవ‌డంతో ఎదురుగా ఉన్న స‌ర్వీసింగ్ సెంట‌ర్‌లో చూపించ‌గా సీటు కింద పాము ఉన్న‌ట్లు మెకానిక్ గుర్తించి దీక్షిత్ రెడ్డికి తెల‌ప‌డంతో ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యాడు. వెంట‌నే స్నేక్ సొసైటీ స‌భ్యుల‌కు స‌మాచారం అందించ‌గా స‌భ్యుడు ఒక‌రు వ‌చ్చి పామును ప‌ట్టుకుని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించాడు. పాము విష‌ర‌హిత‌మైన జెర్రిపోతు కావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పిందని దీక్షిత్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ముందు రోజు రాత్రి త‌న నివాసం వ‌ద్ద పాము క‌నిపించింద‌ని, చీక‌ట్లో వెదికిన‌ప్ప‌టికీ పాము జాడ దొర‌క‌లేద‌ని, అదే పాము సీటు కింద‌కి చేరి ఉండొచ్చ‌ని దీక్షిత్ తెలిపాడు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here