నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎండి.నిజామొద్దీన్ ఆకస్మికంగా మృతి చెందారు. ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత పదిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. నిజాం లస్సీ, హలీం వ్యాపారాన్ని చందానగర్‌లో మూడు దశాబ్దాలకు పైగా నిర్వహిస్తున్న నిజామొద్దీన్ శేరిలింగంపల్లి వాసులకు సుపరిచితుడు. కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ నాయకుడిగా, చందానగర్ స్ట్రీట్ వెండార్స్ అసోసియేషన్ నాయకుడిగా స్థానిక ప్రజలలో మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో సైతం తన కొడలు అక్సారీ అలీ బేగం ను చందానగర్ డివిజన్ నుండి బరిలో నిలిపారు. మంగళవారం చందానగర్ లోని ఆయన నివాసంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నిజామొద్దీన్ మృతి పట్ల తీవ్ర భాస్కరరెడ్డి విచారం…
కాంగ్రెస్ పార్టీ నేత ఎండి.నిజామొద్దీన్ మృతిపై బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి విచారం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు, నాయకులకు తలలో నాలుకలా ఉంటూ పార్టీలకు, మతాలకు అతీతంగా అందరితో సత్సంబందాలు కలిగి ఉండేవాడన్నారు. అతని మరణం తీవ్రంగా బాధించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానన్నారు.