నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ లాక్‌డౌన్ అనంతరం ఆన్‌లైన్ తరగతులకే పరిమితమైన పాఠశాలలు నెలల అనంతరం తిరిగి తెరచుకున్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలో 59 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 14640 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం బడులు తెరచుకోవడంతో 1954 మంది ప్రభుత్వ విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాధికారి వెంకటయ్య తెలిపారు.
పాఠశాలల పునఃప్రారంభ నేపథ్యంలో బడుల ప్రాంగణాలను శుభ్రం చేయించి శానిటైజేషన్ చేశారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు స్ర్కీనింగ్ నిర్వహించి శానిటైజర్ అందుబాటులో ఉంచారు. విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు ఎమ్ఈఒ వెంకటయ్య తెలిపారు. కాగా ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను సైతం కొనసాగిస్తూ పాఠశాలలను తెరవడంతో విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి కనబరచలేదు. దీంతో కొద్దిశాతం మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరైనట్లు సమాచారం.