నమస్తే శేరిలింగంపల్లి: నిరుపేద కుటుంబంలో పుట్టిన సరస్వతీ పుత్రికలు వారు. చదువులో ఉత్తమ ప్రతిభను కనబర్చుతూ మంచి స్థాయికి ఎదగాలనే తపన వారిలో ఉన్నా లక్ష్మీ దేవి వారిని కనికరించడం లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు సెల్‌ఫోన్ లేకపోవడంతో ముగ్గురు చిన్నారులు చదువులకు దూరమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంజనేయులు, ఆదిలక్ష్మి దంపతులు బ్రతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లి హుడాకాలనీలో నివాసం ఉంటున్నారు. ఆంజనేయులు వాచ్‌మెన్‌గా పనిచేస్తూండగా ఆదిలక్ష్మి బట్టలు కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. వారికి ముగ్గురు ఆడ సంతానం. పెద్ద కుమార్తె సంజన 5వ తరగతి, రెండవ కుమార్తె జానకి 4వ తరగతి, చిన్న కూతురు లత 2వ తరగతి. స్థానిక తారానగర్ వీకర్ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆదిలక్ష్మికి శస్త్రచికిత్స జరగడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. ఆంజనేయేలు సంపాదనతో కుటుంబ పోషణే కష్టమవుతుంది. కాగా కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవ్వడంతో సంజన, జానకీ, లతలకు సమస్యలు మొదలయ్యాయి. ఇంట్లో ఒక్కటే మొబైల్ ఉండటంతో తరగతులకు సరిగ్గా హాజరు కాలేకపోయారు. టీవీలో ప్రసారమయ్యే తరగతులను వింటున్నప్పటికీ అర్థం కాక వారి చదువు అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇంట్లో ఉన్న ఒక్క సెల్‌ఫోన్ చెడిపోవడంతో తరగతులు వినలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు ముగ్గురూ చదువులో చక్కని ప్రతిభ కనబరిచే వారని, వారికి ఆర్థిక తోడ్పాడునందిస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరని పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మజదేవి అన్నారు. చిన్నారులకు ఆర్థిక సహాయం అందజేయాలనుకునే ధాతలు 9490218691 నెంబరులో సంప్రదించాలని ఆమె కోరారు.