నమస్తే శేరిలింగంపల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న పేదింటి విద్యార్థినుల కష్టంపై నమస్తే శేరిలింగంపల్లి ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. సెల్‌ఫోన్ లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్న సంజన, జానకి, లత లకు చేయూతనందించాలని కోరుతూ “సరస్వతీ పుత్రికలను కటాక్షించని లక్ష్మీదేవి” అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనానికి స్పందించిన చందానగర్ బ్లాసోమ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సుచిత కిరణ్‌రావు చిన్నారుల తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, ఆంజనేయులులకు మంగళవారం రెడ్‌మి 9 మొబైల్ ఫోన్ అందజేశారు. దీంతో పాటు చిన్న కూతురు లతకు పదవతరగతి వరకు ఉచితంగా తమ పాఠశాలలో చదువు చెప్పిస్తామని హామీ ఇవ్వగా తమ ముగ్గురు పిల్లలనూ ఒకే విధంగా చదివిస్తామంటూ సున్నితంగా తిరస్కరించారు. తమ సమస్యను తెలుసుకుని మొబైల్‌ఫోన్ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మజ దేవి మాట్లాడుతూ విద్యార్థినుల సమస్యను ప్రచురించిన నమస్తే శేరిలింగంపల్లికి, మొబైల్ ఫోన్ అందజేసిన బ్లాసోమ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ సుచిత కిరణ్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె కోరారు.