ప్ర‌జ‌లు ప‌బ్లిక్ టాయిలెట్ల‌లో ప‌రిశుభ్రత‌ను పాటించాలి: డిసి సుధాంశు నంద‌గిరి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌ను నిర్మూలించి పరిశుభ్రతను పెంపొందించుటలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి ప‌రిధిలోని అన్ని సర్కిళ్ల‌లో ప‌బ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశామ‌ని, వీటి వినియోగంలో ప్ర‌జ‌లు ప‌రిశుభ్ర‌త‌ను పాటించాల‌ని చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మీష‌న‌ర్ సుధాంశునంద‌గిరి అన్నారు. బుధ‌వారం స‌ర్కిల్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వ‌హ‌ణ‌ను ఆయ‌న జిహెచ్ఎంసి అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా సుధాంశు మాట్లాడుతూ చందానగర్ సర్కిల్ లోని వివిధ కమర్షియల్ రోడ్లు, కాలనీలు, పార్కులు, చెరువుల పరివాహక ప్రాంతాల్లో పౌరులకు అత్యవసర సమయాల్లో సేవలు అందించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని సర్కిల్ లోని అన్ని వార్డుల్లో నెలకొల్పిన‌ట్లు తెలిపారు. పౌరులు టాయిలెట్స్ ను వాడినప్పుడు గుట్కా, పాన్ మొదలైన వాటిని లోపల ఉమ్మివేయ‌రాద‌ని, సిగరెట్, బీడీ పీకలు లోప‌ల‌ వేయవద్దని, విసర్జన పూర్తి అయిన తర్వాత‌ ఫ్లష్ వాటర్ సరిగా వాడాలని సూచించారు. టాయిలెట్ పరిసర ప్రాంతాల్లో చెత్తను వేయవద్దని, పౌరులు అందరూ టాయిలెట్స్ పరిశుభ్ర‌తకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. కొందరు సంఘ విద్రోహులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టాయిలెట్స్ డోర్లు ధ్వంసం చేయడం, సింకులు ఎత్తుకెళ్లడం, ట్యాపులు విరగగొట్టడం, స్టిక్కర్లు పీకివేయడం లాంటి వాటికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై పోలీస్ వారి సహకారం తో పూర్తి నిఘా పెట్టడం జరిగిందని తెలిపారు. టాయిలెట్లకు నష్టం చేస్తున్నవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలి పెట్టే ప్రసక్తి లేదని వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.


స‌ర్కిల్ ప‌రిధిలోని ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను ప‌రిశీలిస్తున్న డిసి సుధాంశ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here