నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రజల పట్ల అవలంభిస్తున్న అప్రజాస్వామిక రాజకీయ చర్యలను ఎండగడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల ముందుకు తెచ్చే కార్యక్రమమే ప్రజా – గోస బిజెపి – భరోసా కార్నర్ సమావేశాలు అని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ లో 22, 23, 24, 34, 35 బూత్ ల శక్తి కేంద్ర ఇన్ ఛార్జిలు హనుమంతు నాయక్ , గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై, పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, రేషన్ బియ్యం, ఈ శ్రమ్ కార్డులు, యూరియా, వ్యవసాయ సబ్సిడీలు, గ్రామ పంచాయతీ నిధులు, వంటి పథకాలకు ఇచ్చే నిధులను ప్రజలకు వివరించాలని, బూతు స్థాయి నేతలకు సూచించారు. రాబోయే ఎన్నికలకు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బిఅర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టుతూ కుటుంబ నియంత పాలన అంతమొందించడానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11000/- వేల స్ట్రీట్ కార్నర్ మీటింగుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను ప్రజలకు వివరించడానికి, చైతన్య పరచడానికి మంచి వేదిక అని అన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.