నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విపత్కర సమయంలో ప్రాణలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ పోస్టల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లాక్ డౌన్ కర్ఫ్యూలో విధులు నిర్వహిస్తున్న 350 మంది పోలీసులకు అల్పాహారాన్ని అందజేశారు. నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, రామ్ నగర్ ఎక్స్ రోడ్, ఫీవర్ హాస్పిటల్, రామంతపూర్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పోస్టల్ సిబ్బంది అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ర్టంలో కోవిడ్ నివారణ కోసం విధించిన లాక్ డౌన్ ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎంతో మంది పోలీసులు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. పోస్టల్ శాఖ సిబ్బంది అందించిన అల్పాహార పంపిణీకి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారన్నారు.