చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో టిఆర్ఎస్ పార్టీ ప్రకటించకుండా మిగిలి ఉన్న చందానగర్ డివిజన్ అభ్యర్థిని పార్టీ అధిష్టానం మరికొద్ది సేపట్లో ప్రకటించనుంది. ఇతర డివిజన్‌లతో పోల్చితే ఈ డివిజన్ అభ్యర్థి ఎంపిక కోసం అధిష్టానానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. క్షేత్రస్థాయి సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, నియోజక వర్గ పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకున్న సెలక్షన్ టీం చివరగా డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన సతీమణి మంజుల రఘునాథ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జంట సర్కిళ్లలో ఉన్న 7 డివిజన్లలో ఐదింటిలో సిట్టింగులకే అవకాశం ఇచ్చిన అధిష్టానం చందానగర్ విషయంలో మాత్రం నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ కార్పొరేటర్ మినహా డివిజన్ నుండి టిఆర్ఎస్ టికెట్ ఆశించిన నాయకులంతా కలిసి తమలో ఎవరికి అవకాశం ఇచ్చిన సమిష్టిగా ముందుకు సాగుతాం అని అధిష్టానంకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈక్రమంలోనే మంజుల రఘునాథ్ రెడ్డి అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు మంజుల రఘునాథ్ రెడ్డి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. మరోవైపు తాజా మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సైతం నామినేషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది.