నమస్తే శేరిలింగంపల్లి: సాయుధ పోరాటం ద్వారానే భారతమాతకు విముక్తి కలుగుతుందని నమ్మి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఇచ్చేసిన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి సీతరామరాజు అని బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. అల్లూరి సీతరామరాజు 124 జయంతిని పురస్కరించుకొని ఆదివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్ లో మూర్తి రాజు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని బోయిని మహేష్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 ఏళ్ల అల్లూరి సీతరామరాజు జీవన ప్రయాణంలో గిరిజనులకు, నిరుపేదలకు, నిరక్షరాస్యుల్లో దేశ భక్తి జ్వాలను రగల్చిన విప్లవ యోదుడని పేర్కొన్నారు. 1897 జూలై 4 న వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించిన వీరుడే అల్లూరి సీతరామరాజు అని అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే భరతమాతకు స్వేచ్ఛా వాయువులు సాధ్యమని నమ్మి చివరి వరకు పోరాడి తెల్ల దొరలకు కునుకు లేకుండా చేశారన్నారు.
అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పి. శ్యామలరాజు, డీఎస్.రాజు, హరి, పీఎస్ ఎన్ రాజు , డి. సూర్యనారాయణ రాజు, పి.వర్మ సుబ్బా రావు తదతరులు పాల్గొన్నారు.