నమస్తే శేరిలింగంపల్లి: అమరవీరుల ఆశయాలు, ఉద్యమకారుల పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దొరల గడీలల్లా బంధీగా మారిందని బిజెపి శేరిలింగంపల్లి ఇంచార్జీ గజ్జల యోగానంద్ వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో మంగళవారం బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ యోగానంద్ పాల్గొన్నారు. బండి సంజయ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించి స్వార్థ పాలకులు అధికారంలోకి వచ్చారని, కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వ పోకడలతో నాటి ఆశయాలు, పోరాటాలకు విలువ లేకుండా చేశారన్నారు. ఈ దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుని, బంగారు తెలంగాణ కలల్ని సాకారం చేసుకోవడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పాలకులు ఏడేళ్ళుగా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేకమైన, మోసపూరితమైన విధానాలపై ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మొదలుపెట్టిన పోరుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. స్వార్థ పాలకుల నైజాన్ని బట్టబయలు చేసి, తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో జరిగే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడం తెలంగాణ తల్లికి నిజమైన సేవగా భావిస్తున్నానన్నారు.