మద్యం రహిత నూతన సంవత్సర వేడుకలకు పిలుపు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): నూతన సంవత్సరానికి మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఉత్సాహంతో స్వాగతం పలకాలనే లక్ష్యంతో ఆడ్‌లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జీరో అవర్ రన్ – ఇంటు ది న్యూ ఇయర్ కార్యక్రమ పోస్టర్‌ను PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. జీరో అవర్ రన్ వెనుక ఉన్న ఉద్దేశం ఎంతో సరళమైనదని, ఏడాదిని పరుగుతో ముగించి, నూతన సంవత్సరాన్ని పరుగుతో ప్రారంభించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మద్యంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి బదులుగా ఫిట్‌నెస్‌, శక్తి, సానుకూల ఆలోచనలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని ఆడ్‌లైఫ్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 100 శాతం మద్యం రహితంగా, 100 శాతం వినోదం, సంబరాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఒకే వేదికపై కలిసి పరుగెత్తుతూ, ఆనందంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన, మాదకద్రవ్యాలు, మద్యం లేని తెలంగాణ నిర్మాణం కోసం హైదరాబాద్ నగర ప్రజలు, రన్నర్లు, కుటుంబాలు, యువత, ఫిట్‌నెస్‌ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జీరో అవర్ రన్‌ను విజయవంతం చేయాలని గాంధీ కోరారు. ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆడ్‌లైఫ్ ట్రస్ట్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

జీరో అవర్ రన్ – ఇంటు ది న్యూ ఇయర్ కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 31న గ‌చ్చిబౌలి స్టేడియంలో ఆడ్‌లైఫ్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆడ్‌లైఫ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అజయ్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్, ఖాజా, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here