45 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.44.20 లక్షల సైబేజ్ ఖుష్బూ స్కాలర్‌షిప్‌లు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో సైబేజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సైబేజ్ ఖుష్బూ ప్రోగ్రామ్ ద్వారా 45 మంది బీటెక్ విద్యార్థులకు రూ.44.20 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేసింది.

గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ బిల్డింగ్‌లో ఉన్న సైబేజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయంలో ఈ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన 20 మంది విద్యార్థులకు, దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 20 మంది విద్యార్థులకు, దత్తత గ్రామాలకు చెందిన మరో ఐదుగురు విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన 45 మంది విద్యార్థుల కళాశాల ఫీజులు, హాస్టల్ ఫీజుల చెల్లింపునకు ఈ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సైబేజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పుచ్చ వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు బీటెక్ పూర్తి చేసే నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం సైబేజ్ ఖుష్బూ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సీఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఎంఎల్ఆర్ కళాశాల హెడ్ ప్లేస్‌మెంట్ రవిచంద్ర మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు చేయూతనిచ్చేలా సైబేజ్ ఖుష్బూ స్కాలర్‌షిప్‌ల కోసం తమ కళాశాలలను ఎంపిక చేయడం సంతోషకరమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ సైబేజ్ సీఎస్ఆర్ హెడ్ రీతూ నతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్కాలర్‌షిప్‌లకు ఎంపికై ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కలలను సాకారం చేసేందుకు ముందుకొచ్చిన సైబేజ్ కంపెనీతో పాటు సీఎస్ఆర్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పుచ్చ వెంకటేశ్వర శర్మ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ – సీఎస్ఆర్ సురేష్ అనపురపు, సీఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఎంఎల్ఆర్ కళాశాల హెడ్ ప్లేస్‌మెంట్ రవిచంద్ర, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here