విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో శేరిలింగంపల్లి మండల బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2026-27 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరుచుకొని, ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

PJR స్టేడియం అభివృద్ధి కోసం రూ.20 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు గాంధీ వెల్లడించారు. అన్ని రంగాల్లో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. PJR స్టేడియం క్రీడాకారులకు చక్కని వేదికగా నిలుస్తోందని, దీనిని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు తాము ఎంచుకున్న క్రీడా రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి శేరిలింగంపల్లి ప్రాంత ఖ్యాతిని నలుదిశలా చాటాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్ల, శేరిలింగంపల్లి మండల బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు నిజాం అలీ ఖాన్, కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి హిమ బిందు, రాష్ట్ర అధ్యక్షుడు భీష్మ రెడ్డి, వాసుదేవ రావు, అస్లాం, కిరణ్, శ్రీనివాస్ శంకర్, రాజు, భారత్ కుమార్, ఆచార్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here