శేరిలింగంపల్లి, జూన్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): యోగా శరీరాన్ని బలపరుస్తుందని, మనస్సును ప్రశాంతపరుస్తుందని, దైనందిన జీవితంలో అవగాహన, బాధ్యతను పెంచుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ పార్క్ లో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం (యోగ వేదిక) కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యోగ సాధనలో పాల్గొని ధ్యానం చేశారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఆయన యోగా బృందానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక భూమికి యోగా, ఒకే ఆరోగ్యం అని అన్నారు. ఇది వ్యక్తిగత శ్రేయస్సుకు, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.