శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, సావిత్రిబాయి విమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బెల్లం మాధవి నాయకత్వంలో మహిళా పారిశ్రామికవేత్తల చేనేత హస్తకళా ఉత్పత్తుల మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హాజరై మహిళా వ్యాపారవేత్తలను అభినందించారు. వారు మేళాలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్‌ను సందర్శించి ఉత్పత్తులను పరిశీలిస్తూ మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ మేళాలో సూపర్ నెట్, కోట, చందేరీ చీరలు, జ్యూట్ బ్యాగులు, అరటినార వస్త్రాలు, సిరిధాన్యాలు, వివిధ రకాల తినుబండారాలు, బొమ్మలు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు, కార్పెట్లు తదితర ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కరవాది సాయి శరణ్య బృందం నిర్వహించిన కర్ణాటక సంగీత కచేరి, డాక్టర్ విహారిక సాయి శిష్యబృందం అందించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శివరాం, విష్ణు, చలం, రామాంజనేయులు, కృష్ణ, నాగలక్ష్మి, త్రిలోచన్ తదితరులు పాల్గొన్నారు.






