శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగినప్పుడే సమాజం ప్రగతి పథంలో నడుస్తుందని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్, ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి అన్నారు. శేరిలింగంపల్లి రచయితల సంఘం, తెలుగు వెలుగు సాహిత్య వేదిక, ఎస్ వి ఫౌండేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగిన , ఉత్తమ ఉపాద్యాయురాలు మేచినేని సుభాషిని కి చందానగర్ హుడా కాలనీలో ఆదర్శ మహిళ అవార్డును ప్రదానం చేశారు. శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మోటూరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఆలపాటి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అందుకు ఆత్మస్థైర్యమే ఆయుధం కావాలని ఆయన అన్నారు. జీవితంలో పెను సవాళ్ళను ఎదుర్కొంటూ విజయం సాధించిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , సినీ గాయకుడు రవి వర్మ మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం అంత సులువైన పని కాదని అందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, అంకితభావం అవసరమన్నారు. అన్నీ ఉన్నా జీవితంలో ఏమి సాధించలేని మహిళలు ఎందరో ఉన్నారని వారందరికీ. భిన్నంగా సుభాషిణి ఏడుపదుల ఏళ్లు నిండినా ఎందరికో ఉపాధి కల్పించటం అభినందనీయమన్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఉపాధ్యాయురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మేచినేని సుభాషిణికి శేరిలింగంపల్లి రచయితల సంఘం, తెలుగు వెలుగు సాహిత్య వేదిక, ఎస్ వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళ అవార్డును డాక్టర్ ఆలపాటి, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ కవులు వసీరా.. పత్తిపాక సురేందర్, శేరిలింగంపల్లి రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీంద్ర బాబు అరవా, కార్యవర్గ సభ్యురాలు సుమ చంద్ర, వనజ ప్రియ, కుటుంబ సభ్యులు వేణు, కీర్తన తదితరులు పాల్గొన్నారు.