శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవుల ఆరాధ్య దైవం జాతర్లపై రెడ్డిల పెత్తనం ఏమిటి అని బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ ప్రశ్నించారు. యాదవుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ లింగమంతుల స్వామి గొల్ల గట్టు పెద్దగట్టు జాతరలో రెడ్డిల పెత్తనం ఏమిటి అని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే తమ పవిత్రమైన కులదైవం శ్రీ శ్రీ లింగమంతుల స్వామి జాతర యాదవుల పండుగలో రెడ్డిల ఆదిపత్యం ఏమిటి, ప్రభుత్వం ఇస్తున్న నిధులను రెడ్డిల జేబులకు పోతున్నాయి, గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు కేటాయించగా 10% ఖర్చు చేసింది, మిగతా 90% ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లాయి, యాదవులను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా గత ప్రభుత్వాలకు భిన్నంగా ఆలోచన చేసి యాదవులకు శాశ్వత ప్రతిపాదన కమిటీని ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 16న జరగబోయే తమ అతి పెద్ద జాతరకు ప్రభుత్వం కేటాయించిన నిధులు శాశ్వత కమిటీని ఏర్పాటు చేసి యాదవులకు మాత్రమే అప్పజెప్పాలి, మళ్లీ రెడ్డి మంత్రుల ఖజానాలోకి పోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది, గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరిగితే ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదవులమంతా ఆందోళన చేపడతాం అని అన్నారు.