అర్హులందరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అందించాలి: యం సిపిఐ(యు) నాయకులు

శేరిలింగంపల్లి, జూన్ 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అర్హులందరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అందించాలని, వర్షాకాలంలో ప్రజల సీజనల్ సమస్యలను పరిష్కరించాలని యం సిపిఐ(యు) నాయకులు అన్నారు. శేరిలింగంపల్లి తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు ఈ మేర‌కు వారు విన‌తిప‌త్రం అంద‌జేశారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. యం సి పి ఐ యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శేరిలింగంపల్లి తహసిల్దార్ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.

పేదలు నివాస స్థలాల పట్టాలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫలితం శూన్యమన్నారు. వందలాదిమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పెన్షన్లకు అర్హులై ఉన్న దరఖాస్తులు చేసుకున్న మంజూరీ చేయకపోవడం అన్యాయం అన్నారు. వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అనేక కాలనీలు సరైన డ్రైనేజీ లేక వరద నీటితో బురద పేరుకొని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే లేడని పేదల కాలనీలో సరైన పారిశుద్ధ్యం లేక దోమలు, ఈగలు, క్రిమి కీటకాలతో అవస్థలు పడుతూ రోగాల బారిన పడుతున్నా కనీసం వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా పాలకులు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రజలందరికీ వర్తింప చేయాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి, కమిటీకార్యదర్శి వర్గ సభ్యులు జి శివాని, యం డి సుల్తాన బేగం, విద్యార్థి సంఘం నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here