శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గణేష్ మండపాల నిర్వాహకులతో రాయదుర్గం పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మణికొండలోని మర్రిచెట్టు కమ్యూనిటీ హాల్‌లో సీఐ తోట భూపతి, ఎస్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన భద్రతా చర్యలు, పోలీసుల నిబంధనలపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ తోట భూపతి మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని సీఐ స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసుల నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయాల్లోనే శబ్ద వ్యవస్థలను వినియోగించాలని సూచించారు. భక్తులు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై కూడా ఉందని భూపతి పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగేలా మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ తోట భూపతి కోరారు. ఈ సమావేశంలో మణికొండకు చెందిన నాయకులు, గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





