శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులపై అవగాహన సదస్సు, గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు పొందడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షలు, సహజ మరణానికి రూ.1.30 లక్షలతోపాటు అంత్యక్రియల ఖర్చు, వైకల్యానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. అలాగే ఆడబిడ్డ వివాహానికి రూ.30,038, ప్రసూతి సాయంగా రూ.30,038, ఉచిత వైద్యం, ఈఎస్ఐ, ఈపీఎఫ్, పిల్లలకు స్కాలర్షిప్లు, ఉచిత టూల్ కిట్లు, నైపుణ్య శిక్షణ వంటి పలు ప్రయోజనాలు లేబర్ కార్డు ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో లేబర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి వీర బొమ్మ రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు వీరమల్ల వీరేందర్ గౌడ్, ఉయ్యూరు శ్రీదేవి, డీసీసీ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ ముద్దంగుల తిరుపతి, శేరిలింగంపల్లి నియోజకవర్గ లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహన్ రెడ్డి, కట్ల శేఖరరెడ్డి, వీరమల్ల సంగీత, బి. నాగరాజు, నగరపు జాన్సన్, దయాకర్ రెడ్డి, పల్లె వెంకటరెడ్డి, చందానగర్ డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షురాలు శాంత, ఉపాధ్యక్షురాలు నజియా బేగం తదితరులు పాల్గొన్నారు.





