హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చ గొట్టాలని చూస్తున్న సంఘ విద్రోహ శక్తులను అణచి వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కొన్ని అరాచక శక్తులు రాష్ట్రంతోపాటు నగరంలోనూ అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయన్నారు. అలాంటి శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై ఆయన ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి తమ ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో, నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకే అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. నగరంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని దెబ్బ తీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారిని అణచి వేయాలని కేసీఆర్ అన్నారు. సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు పూర్తి అధికారాలను ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సీపీలు వీసీ సజ్జనార్, అంజనీకుమార్, మహేష్ భగవత్, అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజీ శంకర్ రెడ్డి, వరంగల్ ఐజీ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.