శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాజీవ్ యువ వికాస పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గం కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ అన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు. ఇందులో 60 నుంచి 80 శాతం వరకు మొత్తాన్ని సబ్సిడీగా కూడా అందిస్తారని తెలియజేశారు. ఈ పథకానికి ఆధార్ కాపీ, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, లబ్ధిదారుడి ఫోన్ నంబర్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ అవసరం అవుతాయని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే కుటుంబంలోని ఒక్కరికే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారని అన్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమకు నచ్చిన వ్యాపారం లేదా షాపు, సేవ నిర్వహించుకోవచ్చని అందుకు పైన తెలిపిన రూ.3 లక్షల ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ఏప్రిల్ 5ను చివరి తేదీగా నిర్ణయించారని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.