శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక నేతలతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా ఒక ప్రణాళిక ప్రకారం దశలవారీగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాయదుర్గం గ్రామం లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నాం, వర్షాలు కురిసినా నీరు నిలువకుండా, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేస్తాం అని అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశించారు.

అలాగే డ్రైనేజీ పైప్ లైన్ వేసిన వెంటనే రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. అదేవిధంగా కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఉంటాయని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరేందర్ ముదిరాజ్, సురేష్, దయాకర్, శ్రీశైలం, బ్రహ్మయ్య, దుర్గా రామ్, శేఖర్, సుమన్, ప్రకాశ్, ఇందిర, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





