- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తోందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణీకులకు నీడ కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ తరపున హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్ షెల్టర్ ఆవరణలో స్వచ్చ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. బస్ షెల్టర్ల ఏర్పాటుతో ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో మొత్తం 31 బస్ షెల్టర్లు, టాయిలెట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. తక్కువ కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన కెకెఆర్ కె సంస్థ ను రాగం నాగేందర్ యాదవ్ అభినందించారు. ఆయన వెంట కెఆర్ కె సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గోపీనగర్ టీఆర్ఎస్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్, నాయకులు శ్రీకాంత్ యాదవ్, మల్కయ్య ఉన్నారు.