రక్తదానం మహాదానం : సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

  • అమరవీరుల సంస్మరణ దినోత్సవ ప్రారంభం నుంచి 2957 యూనిట్ల రక్త సేకరణ
  • కోవిడ్ సమయంలో మొత్తం 5322 యూనిట్ల రక్త సేకరణ
  • సైబరాబాద్ లో ఇప్పటివరకు మొత్తం 8279 యూనిట్ల రక్త సేకరణ
  • అమరుల త్యాగాలు మరువలేనివి : సీపీ

సైబ‌రాబాద్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో (అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31వరకు) భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ లో అన్ని పోలీస్ స్టేషన్లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి మొత్తం 2957 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో అక్టోబర్ 27వ రోజున ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ క్యాంప్ ని ప్రారంభించారు. అనంతరం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల రక్తదానం చేశారు.

ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

కరోనా సమయంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎస్సీఎస్సీ వాలంటీర్లు, వివిధ ఎన్జీఓలు, కమ్యూనిటీలు ముందుకు వచ్చి పెద్దఎత్తున సహాయక కార్యక్రమాలు చేప‌ట్టడంతోపాటు రక్త దాన‌ శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 5322 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సైబరాబాద్ లో ఇప్పటివరకు మొత్తం 8279 యూనిట్ల రక్తం సేకరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, తలసేనియా సికిల్ సెల్ సొసైటీ, గాంధీ హాస్పిటల్, ఎమ్ఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ ఆసుపత్రిల‌ సహకారంతో త‌లసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం రక్తాన్ని అందించారు.

శిబిరంలో ర‌క్త‌దానం చేస్తున్న పోలీసు సిబ్బంది

అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. అమరుల త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని సైబరాబాద్ సీపీ అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here