మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో 32 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ జ్ఞాన గణపతి సన్నిధానంలో సిద్ధి, బుద్ధి, శ్రీ కుమారస్వామి సన్నిధానంలో వల్లీ దేవసేనలకు శ్రీ శ్రీ విద్యానంద గిరి స్వామీజీ చేతుల మీదుగా మారుతి శర్మ ఆధ్వర్యంలో క్రతువు నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి సిద్ధి, బుద్ధి అమ్మవార్లకు, శ్రీ కుమారస్వామి వల్లీ దేవసేన అమ్మవార్లకు కల్యాణ మహోత్సవంను నిర్వహించారు.
వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలను చేపట్టారు. సాయంత్రం గ్రంథాల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజోపచారాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భారతీయం సత్యవాణి, అట్లూరి సుబ్బారావు పాల్గొన్నారు.