- అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. శేరిలింగంపల్లి సర్కిల్‌లో పరిధిలోని గచ్చిబౌలి సంధ్యాకన్వెన్షన్‌లో 865 మంది, చందానగర్ సర్కిల్‌లోని పీజేఆర్ స్టేడియంలో 970 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, సర్కిల్ ఉపకమిషనర్లు తేజావత్ వెంకన్న, సుధాంష్ నందగిరి, ఉప వైద్యాధికారులు డాక్టర్ ఎస్.రవి, డాక్టర్ కార్తీక్ మనీషీ, ఇన్‌స్పెక్టర్లు క్యాస్ట్రో, సురేష్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్‌రెడ్డి, హఫీజ్‌పేట్ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సలా దేవిలతో కలసి ప్రభుత్వ విప్ గాంధీ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభన కొనసాగుతున్న నేటి తరుణంలో ప్రభుత్వం ప్రజలకు ధైర్యం కల్పించేలా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందడుగు వేసిందని అన్నారు. కేంద్రం నుంచి సరిపడా వ్యాక్సిన్ రావడంలేని నేపథ్యంలో మొదట సూపర్ స్ప్రెడర్స్‌కి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. పదిరోజుల పాటు ప్రతి సెంటర్‌లో వెయ్యి మంది చొప్పున సూపర్ స్ప్రెడర్స్ కేటగిరి వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అర్హులైన వారికి ముందస్తుగా కూపన్లు ఇవ్వడం జరుగుతుందని, ప్రణాళిక ప్రకారం వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.
జిల్లా వైద్యాధికారులు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ సృజనలు మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్భంధీగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వ్యాక్సినేషన్‌లో పాల్గొనే సిబ్బందికి, వ్యాక్సిన్‌కోసం వచ్చే వారికి జీహెచ్ఎంసీ మంచి ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి, డీఈ రమేష్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, చందనాగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రవిందర్‌రావు, గుడ్ల ధనలక్ష్మి, దాసరి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.