నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్‌కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిశారు. తమ కాలనీలోని రోడ్‌నెంబర్ 8కి ఆనుకుని వెస్ట్మెట్రో బిల్డర్ ఏడేళ్లక్రితం 255 ఫ్లాట్లతో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టాడని, ఐతే సదరు అపార్ట్మెంట్ డ్రైనేజీ లైన్‌ను నేరుగా తమ కాలనీలోని డ్రైనేజీకి అనుసంధానం చేయడంతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నామని అన్నారు. ఇదే సమస్యను ఈ ఏడాది ఏప్రిల్ 12న తమ దృష్టికి తీసుకురావడంతో ఎట్టకేలకు ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి బిల్డర్ ముందుకు వచ్చాడని తెలిపారు. ఐతే లేఅవుట్లో ఉన్న ప్లాన్‌కు విరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్‌ను మా కాలనీ వైపు నిర్మించేందుకు యత్నిస్తున్నారని, అదే జరిగితే కాలనీవాసులు దుర్గంధంతో అవస్థలు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారం ఎస్టీపీ నిర్మాణం జరగేలా చూసి తమకాలనీ వాసులకు సహకారం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ నిబంధనల ప్రకారమే ఎస్టీపీ నిర్మాణం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గాంధీని కలసిన వారిలో ఫ్రెండ్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుప్పెలి వెంకటేశం, జాతీయ బీసీ అధ్యాయన వేదిక వ్యవస్ధాపక అధ్యక్షులు డీవీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి డబ్బీరు నవీన్ పట్నాయక్, ఉపాధ్యక్షులు ఫసియుద్దీన్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
