ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి: ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. శివకుమార్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైఖ్య ( ఏఐఎస్ఎఫ్) శేరిలింగంపల్లి మండల సమావేశాన్ని ఇజ్జత్ నగర్ ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయకపోవడం, అక్రమ డిప్యూటేషన్ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ విద్యా వలంటీర్లతో బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి మౌలిక వసతులు కల్పించాలని, సరైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం చెత్తాచెదారం నిండి పోయిందని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించి పౌష్టిక ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కై రూ. 10 లక్షల నిధులను విడుదల చేయాలని, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు.
విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కార్పొరేట్ విద్యసంస్థల పై శేరిలింగంపల్లి నియోజకవర్గ కేంద్రంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడిగా ధర్మ తేజ, ప్రధాన కార్యదర్శిగా టి. అజయ్, నితీష్, ఉపాధ్యక్షులుగా చందు, సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు రామకృష్ణ, కే చందు యాదవ్, కే వెంకట స్వామి, కే కాసిం, ప్రజానాట్యమండలి గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here