నమస్తే శేరిలింగంపల్లి: సమాజంలోని సకల జనుల సహకారంతో సమసమాజ స్థాపన ఏర్పడుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం హుడా కాలనీలో ప్రజాపిత బ్రహ్మకుమారి అంతర్జాతీయ మెడిటేషన్ సెంటర్ నూతన భవనానికి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని మంచి పనులు చేసినా విమర్శిస్తూ, అడ్డంకులు కలుగజేస్తూ, కిందికి తోసే వారు అనేక మంది ఉంటారని, వీటన్నిటినీ అధిగమించాలంటే బ్రహ్మకుమారీస్ నేర్పించే మెడిటేషన్ దోహదపడుతుందని అన్నారు. పరమాత్ముని ఆశీస్సులతో పాటు అనేక శక్తులు, మానసిక స్థైర్యం పొందవచ్చని అన్నారు. బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం రాజస్థాన్ సంస్థ ప్రతినిధి సీనియర్ రాజయోగి బ్రహ్మ కుమారీ సూర్య భాయ్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమకు తాము ఆత్మ గా భావిస్తూ పరమాత్ముని స్మృతి చేయడమే మెడిటేషన్ అన్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే కోరికతో, సత్ప్రవర్తనతో తమకు తాము తీర్చిదిద్దుకుంటారని అన్నారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే సమాజానికి సేవ చేయగలమని అన్నారు. సీనియర్ రాజయోగిని బి కే గీత బహన్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండాలని, నెమ్మదిగా మాట్లాడాలని అనవసరంగా మాట్లాడకూడదని పేర్కొన్నారు. మనసా వాచా కర్మణా ఎవరినీ నొప్పించకుండా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రాజయోగి సూరజ్ భాయ్ ను ఎమ్మెల్యే గాంధీ ఘనంగా సత్కరించారు. హుడా కాలనీ సంస్థ ఇంచార్జీ బికే శైలజ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు గత రెండు దశాబ్దాలుగా బ్రహ్మకుమారీస్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఇంకా విశేష సేవలు అందించడానికి ఇక్కడ పెద్దఎత్తున మెడిటేషన్ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. సహకరిస్తున్న ఎమ్మెల్యేతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సబ్ జోన్ హెడ్ బికే సరోజిని, బి కే జ్యోతి, కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ శ్రీకాంత్, చందానగర్ టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.