నమస్తే శేరిలింగంపల్లి:ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి అన్ని రంగాల్లో డివిజన్ ను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్తానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. మియాపూర్ బస్ బాడీ మెయిన్ రోడ్డు సమీపం నుంచి మక్తా మహబూబ్ పేట్ కిందికుంట చెరువు వరకు నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనులను, మయూరినగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీక్రాంతి, ఏఈ దీరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.