నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు టీఅర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ బిజెపి నాయకులను అడ్డుకోవడం సిగ్గుచేటని బిజెపి మాదాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యాపేట జిల్లా పర్యటన విజయవంతానికి మియాపూర్ డివిజన్ నుంచి బిజెపి నాయకులు రాధాకృష్ణ యాదవ్, మధు యాదవ్, జి. శ్రీను యాదవ్, బాలు నాయక్, వంశీ బయల్దేరి వెళ్లగా పంతంగి టోల్ గేటు వద్ద పోలీసులు అడ్డుకుని నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి నిరాశతో టీఆర్ఎస్ రైతుల ముసుగులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు బయల్దేరిన వారిని మద్యలో ఆపి పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ అరెస్టు చేయడం సరికాదన్నారు. టీఆర్ఎస్ నేతలను పరిగెత్తించి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాధాకృష్ణ యాదవ్ అన్నారు.
