నమస్తే శేరిలింగంపల్లి: గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్ సారధి స్టూడియోలో టీవీ ఫెడరేషన్ సభ్యులకు ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఫెడరేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి, ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పి.రామ్మోహన్ రావు, టీవి ఫెడరేషన్ అధ్యక్షులు కే. రాకేష్ నానిలు ముఖ్య అథిలుగా పాల్గొన్నారు. వారితో కలసి ట్రస్టు ఛైర్మన్ గుడ్ల ధనలక్ష్మి, డైరెక్టర్ గుడ్ల శ్రీధర్‌లు దాదాపు వెయ్యి మంది సభ్యులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు ఎనలేనివని కొనియాడారు. ఒక రంగం అంటూ లేకుండా కరోనా కారణంగా అవస్థలకు గురైన ప్రతీ రంగంలో ఆ ట్రస్టు తోచిన సేవలను అందించిందని అన్నారు. సినినటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా కష్టసమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి నిత్యావసర వస్తువులను అందించి అన్నదాతగా నిలచిన గుడ్ల ధనలక్ష్మిని ఆ దెవుడు చల్లంగా చూడాలని వేడుకున్నారు. ధనలక్ష్మిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీవీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి నరేందర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు సురేందర్, రామ స్వామి, జయ బాబు, సురేష్, భవాని చౌదరి, సరళా రాణి, పార్వతి ,చిరంజీవి, చక్రవర్తి, మాధవి, సత్య, నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.