నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలు అభివృద్ధికి దూరమయ్యాయని బిజెపి రాష్ట్ర నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి నందకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం అనాజీపూరం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌తో కలసి నందకుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరవ్వడంతోనే గ్రామాలు అభివృద్ధి బాటపడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలతో సహ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేనియెడల తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.