హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి హఫీజ్‌పేట డివిజన్ అభివృద్ధికి సహకరించాలని డివిజన్ బీజేపీ అభ్యర్థి బోయిని అనూష యాదవ్ అన్నారు. జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ పీఠంపై కాషాయం జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్, ప్రకాష్ నగర్, వైశాలి నగర్ లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా బోయిని అనూష యాదవ్ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ కార్పొరేటర్ డివిజన్ కు ఏమి చేయలేదని, ఎన్నికలు వస్తున్న సమయంలో హడావిడి చేస్తున్నారని అన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసలైన వరద బాధితులకు న్యాయం చేయకుండా టీఆర్ఎస్ నాయకులు, దళారులకు కట్టబెట్టారని, అమాయక ప్రజలకు రావాల్సిన వరద సహాయాన్ని దోచుకొని అసలైన బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించి బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోటేశ్వరరావు, గోపి సాగర్, శ్రీనివాస్, మనోజ్, రవి ముదిరాజ్, అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.