నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో చివరి కీలక ఘట్టమైన లెక్కింపు కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లెక్కింపు ప్రకియలో పాల్గొనే కౌంటింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని గచ్చిబౌలి స్టేడియం లో శేరిలింగంపల్లి సర్కిల్ లెక్కింపు సిబ్బందికి, మియాపూర్ లోని సెంటియా గ్లోబల్ స్కూల్ లలో గల డిఆర్సీ సెంటర్ లలో చందానగర్ సర్కిల్ కౌంటింగ్ సిబ్బందితో సమావేశమైన మాస్టర్ ట్రైనర్ లు లెక్కింపు ప్రక్రియ చేసే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈవీఎం లతో పోల్చితే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు క్లిష్టమైన ప్రక్రియ కావడంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా లెక్కింపు లో పాల్గొనే సిబ్బంది పలు సందేహాలను ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ 4 వ తేదీ ఉదయం 8 గం.లకు ప్రారంభం కానుంది.